విశాఖపట్నం (సంపన్నమైన ఒడిశా)విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కేదార్నాధ్, బదరీనాధ్ ఆలయ కమిటీ అధ్యక్షులు అజేంద్ర అజయ్ కలిసారు. సోమవారం రిషికేష్‌లోని విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమానికి వెళ్ళి చార్ధామ్ ప్రసాదాలను పీఠాధిపతులకు అందజేసారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి పలు సూచనలు చేసారు. ఉత్తర భారతదేశంలో వేద పరిరక్షణకు ప్రాధాన్యత కొరవడుతోందని, కేదార్, బదరీలలో నిత్యం వేద పారాయణ చేయాలని సూచించారు. వేద పారాయణ జరిగిన చోట భక్తులపై భగవదనుగ్రహం ద్విగుణీకృతమవుతుందని తెలిపారు. ఉత్తర భారతావనిలో శుక్ల యజుర్వేదానికి ఆదరణ ఉందని, కాన్వ, మాధ్యందిని వేదశాఖలు పారాయణ చేపట్టాలని సూచించారు. వేద పరిరక్షణ బాధ్యతను కేదార్, బదరీ ధామ్ ఆలయాలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్ధులు వేదాలను పఠించగా అజేంద్ర అజయ్ ప్రశంసించారు. స్వరూపానందేంద్ర సూచనలపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. వేద పోషణకు అవసరమైన సలహాలను అందించాల్సిందిగా పీఠాధిపతులను కోరారు. చాతుర్మాస్య దీక్ష ముగిసిన అనంతరం తమ క్షేత్రాలను సందర్శించాలని స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలను ఆయన ఆహ్వానించారు. తమ కమిటీ ఆధ్వర్యంలో ఏడు సంస్కృత పాఠశాలల ద్వారా ఉచిత విద్యను అందిస్తున్నామని స్వరూపానందేంద్ర దృష్టికి తెచ్చారు. కేదార్, బదరీలకు వెళ్ళే మార్గంలో ఉన్న 45 ఆలయాలు, 20 ధర్మశాలలు తమ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని వివరించారు. కేదార్, బదరీ ఆలయ కమిటీకి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించిందని తెలిపారు.